Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు నిమిషాల్లో రూ. 7,572 కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్!

  • దారుణంగా పడిపోయిన టెస్లా కార్ల అమ్మకాలు
  • ఒక్కసారిగా వెల్లువెత్తిన వాటాల విక్రయం
  • 1.1 బిలియన్ డాలర్లు నష్టపోయిన మస్క్
మల్టీ బిలియనీర్, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కేవలం రెండంటే రెండు నిమిషాల్లో 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,572 కోట్లు) నష్టపోయారు. న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, టెస్లా ఐఎన్సీ ఈక్విటీ వాటాలు దారుణంగా పడిపోయాయి. దీంతో బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ 23.4 బిలియన్ డాలర్ల నుంచి 22.3 బిలియన్ డాలర్లకు తగ్గింది.

ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న టెస్లా, ఈ సంవత్సరం తొలి మూడు నెలల వ్యవధిలో అమ్మకాలను ఏ మాత్రం పెంచుకోలేకపోయింది. 2018 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 90,966 యూనిట్లను విక్రయించిన సంస్థ ఈ జనవరి - మార్చి మధ్య 63 వేల యూనిట్లను మాత్రమే అమ్మింది. ఈ గణాంకాలు బహిర్గతం కాగానే, టెస్లాపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, భారీ ఎత్తున ఈక్విటీలు అమ్మకానికి వచ్చాయి. కాగా, ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తుల్లో దాదాపు 10 బిలియన్ డాలర్లు టెస్లా నుంచి వచ్చినవేకాగా, మిగతా 13 బిలియన్ డాలర్లు రాకెట్ బిజినెస్ చేస్తున్న స్పేస్ ఎక్స్ ప్రోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ నుంచి వచ్చింది.
Elon Musk
Tesla
Electric Car

More Telugu News